Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజల కు వారధులు.ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారిదే కీలకపాత్ర. కానీ వారే నిబంధనలకు పాతరేస్తున్నారు. మండలంలో కొందరు ఉద్యోగం ఒకచోట చేస్తారు,నివాసం మరోచోట.ఇంకేముంది సమయానికి రారు.పని చేయరనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదీ మన ప్రభుత్వ ఉద్యోగుల కొందరి పనితీరు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు వెచ్చించి ప్రవేశపెట్టిన పథ కాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలకపాత్ర.ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించేది వారే. అందుకే ప్రభుత్వం పని చేసేచోట నివాసముండాలని నిబంధన విధించింది.మండల వ్యాప్తంగా సగానికిపైగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో అవసరమైన సమయాల్లో ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని నిమిత్తం దూరప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయాలకు వచ్చే ప్రజలు అధికారి ఎప్పుడు వస్తాడా! అని ఎదురుచూడాల్సి వస్తోంది. ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లడం... ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న అధికారులు వారు పనిచేసే ప్రాంతాలు దూరంగా ఉండడంతో కార్యాలయాలకు సమయానికి రాలేకపోతున్నారు. మండలం లోని రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, వైద్య, విద్యా, వ్యవసాయం ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ఉపాధ్యాయులు, పంచాయతీ లకు చెందిన కొందరు ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొంతమంది ఉద్యోగులు రవాణా సౌకర్యం సక్రమంగా లేదన్న సాకుతో వెళ్లాల్సిన సమయానికంటే ముందుగానే వెళ్తున్నారు. దీంతో పనినిమిత్తం ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేయాల్సివస్తుంది.సమయానికి కార్యాలయాలకు ఉద్యోగులు, పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఏజెన్సీ అలవెన్సులు,ఇంటి అద్దెలు స్వాహా... ప్రభుత్వ ఉద్యోగులకు వారి హోదాలకు అనుగుణంగా ప్రభుత్వం వేలాది రూపాయలు ఇంటి అద్దె రూపంలో చెల్లిస్తుంది. కోందరు ఉద్యోగులు స్థానికంగా ఉంటున్నట్లు రుజువులు చూపిస్తున్నా వాస్తవానికి చాలా మంది అదికారులు పట్టణాల్లో నివాసముంటున్నారు. దీంతో ప్రజాధనం అధిక మొత్తంలో దుర్వినియోగం అవుతోంది. ఇలా అధికారులు స్థానికంగా ఉండక పోవడంతో పనుల్లో జాప్యం నెలకొంటోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొ రవచూపి మండలంలోని ఉద్యోగులు పని చేసే చోటే నివాసం ఉండేలా, నిర్ణీత సమయాల్లో విధులకు సక్రమంగా హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-
Aksharam Telugu Daily