Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : షెడ్యూల్డ్ కులాలను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఇతర అభివృద్ధి చెందిన కులాలతో సమానంగా ముందుకు తీసుకురావడం మరియు సమానత్వ సమాజాన్ని సాధించడం” ప్రధాన ఉద్దేశంగా సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పడింది. దీని కోసం విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేస్తూ, వసతిగృహాలు ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 సంవత్సరంలో ఈ శాఖ పేరును “ షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి శాఖ” గా పేరు మార్చటం జరిగినది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ శాఖ 880 వసతిగృహాలను నిర్వహిస్తూ సుమారు 79,000 మంది విద్యార్తులకు వసతి కల్పిస్తున్నారు. ఈ వసతి గృహాలను నిర్వహించటంలో వసతి గృహ సంక్షేమ అధికారులు (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ & సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్, 1996 (జి ఓ ఎం ఎస్ నెంబర్ 436, తేదీ 15-10-1996) లోని రూల్ 16(హెచ్) ప్రకారం ఒక వసతి గృహ సంక్షేమ అధికారి (గ్రేడ్ - 2) విధులలో చేరిన రెండు సంవత్సరాల లోపు ప్రొబేషన్ సమయంలో శాఖాపరమైన పరిక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ నిబంధనలు (జి ఓ ఎం ఎస్ నెంబర్ 189, తేదీ 31.12.1997) ప్రకారం అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్-1, అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్-2, రెవెన్యూ పరీక్ష పార్ట్-1, పేపర్-1 పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. గ్రేడ్-2 వసతి గృహ సంక్షేమ అధికారిగా ఉద్యోగం పొందిన వ్యక్తి తన రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలవ్యవధిలో ఈ పరిక్షలు ఉత్తీర్ణులు తప్పకుండా కావాలి, లేనిచో మరొక సంవత్సరం సమయం ఇస్తారు. ఉత్తీర్ణులు అయినట్లయితే ఉద్యోగంలో చేరిన రోజు నుండి ప్రొబేషన్ తేదిని ప్రకటిస్తారు. ఆలస్యంగా పరిక్షలు ఉత్తీర్ణులు అయినట్లయితే తేదీని సవరిస్తూ ప్రొబేషన్ తేదిని నిర్ణయిస్తారు. ప్రొబేషన్ తేదిని బట్టి ఉద్యోగి సర్వీసును రెగ్యులర్ చేస్తారు. ఇది పదోన్నతులకు ప్రాతిపదిక అవుతుంది. దీనిని అమలు చేస్తూ శాఖా ప్రిన్సిపాల్ సెక్రెటరీ అధ్వర్యంలో ప్రభుత్వం అప్పటి ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్ - 2 ల యొక్క ప్రొబేషన్ తేదీని సవరిస్తూ 2011, 2013 సంవత్సరాలలో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయటం జరిగినది. దీని అమలు వలన శాఖాపరమైన పరిక్షలు ముందు ఉత్తీర్ణులు అయినవారు సీనియర్లుగా, ఆలస్యంగా ఉత్తీర్ణులు అయినవారు జూనియర్లుగా పరిగణిస్తారు. సీనియారిటి లిస్టు తయారుచేయుటకు ప్రాతిపదిక అవుతుంది మరియు ఇది పదోన్నతులపైన ప్రభావం చూపిస్తుంది. రూల్ 16(హెచ్) లో పేర్కొన్న సర్వీస్ రూల్స్ అమలు చేయటం ఇష్టం లేని కొద్దిమంది ఉద్యోగులు సర్వీస్ రూల్స్ 16(హెచ్) కు వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో పలు కేసులు దాఖలు చేసి సర్వీస్ రూల్స్ 16(హెచ్)ను అడ్డుకోవడంతో అప్పటి ప్రభుత్వం సర్వీస్ రూల్స్ 16(హెచ్) అమలు కోసం 2013 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రహించి రిట్ పిటిషన్ డబ్ల్యూ పి నెంబర్ 12741/2013 ను దాఖలు చేసింది. నిజామాబాద్ మరియు కొన్ని జిల్లాల అధికారులు 16(హెచ్) నిబందనను అమలు చేస్తూ సీనియరిటి లిస్టు తయారుచేసి పదోన్నతులు కల్పించినారు. కాని చాలా జిల్లాల్లో ఈ నిబంధనలను అమలుచేయలేదు. కోర్టు కేసును బూచిగా చూపెడుతూ సీనియారిటి లిస్టులు తయారు చేయక పోవటంతో పదోన్నతులకు బ్రేక్ పడింది.మరోప్రక్క అడ్డ దారుల్లో పదోన్నతులు కల్పించటం కోసం 2016 సంవత్సరంలో గవర్నమెంట్ ప్లీడర్ అభిప్రాయాన్ని (నెంబర్ 206/2016/ఎంవీఆర్ /ఎస్ ఈ ఆర్ /హెచ్ సి ,తేదీ 17-08-2016 అఫ్ గౌట్ ప్లీడర్ సర్వీసెస్ టీ ఎస్ , హైకోర్టు అఫ్ తెలంగాణ ) పరిగణలోకి తీసుకొని అక్రమార్గాల్లో కొందరు ఉన్నతాధికారులు తమ అనుయాయులకు పదోన్నతులు కల్పించారు. గవర్నమెంట్ ప్లీడర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పదోన్నతులు తాత్కాలిక ప్రాతిపదికన ఇస్తూ, ఇవి డబ్ల్యూ పి నెంబర్ 12741/2013 కేసు తుది తీర్పునకు లోబడి వుండాలని తెలిపారు. పదోన్నతులు పొందే సమయంలో పదోన్నతులు పొందుతున్న వారి నుండి ఏ సందర్భంలోనైన రివర్షన్ చేయుటకు, కేసు తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని లిఖితపూర్వకంగా "అండర్ టేకింగ్" రాయించుకున్నారు. ఇట్టి పదోన్నతులకు గౌరవ హైకోర్టు లేదా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదు. కానీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 16(హెచ్) నిబందనను పాటించకుండా తాత్కాలిక పదోన్నతులు కల్పించారు. వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్-2 నుండి గ్రేడ్-1 గా తాత్కాలిక ప్రమోషన్ ఇచ్చారు. ఈ తాత్కాలిక పదోన్నతులను నిబందనలకు విరుద్దంగా రెగ్యులర్ చేసారు. మళ్ళీ వీరికే రెండు లేదా మూడు సార్లు అస్వో గా, డిస్వ గా పదోన్నతులు కల్పించారు. అక్రమంగా పదోన్నతులు పొందిన వారు అదే స్థాయిలో పదవి విరమణ కూడా చేశారు. నేటికి మరి కొద్దీ మంది ఉన్నత పదవులలో కొనసాగుతున్నారు.దశాబ్దకాలం సుదీర్ఘ ఎదురుచూపు తరువాత తేది. 01-12-2022 రోజున డబ్ల్యూ పి నెంబర్ 12741/2013 కేసులో ఇద్దరు సభ్యుల హైకోర్టు ధర్మాసనం సర్వీసు రూల్స్ 16(హెచ్) నిబందనకు అనుకూలంగా తుది తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి గతంలో ఇచ్చిన అన్ని తాత్కాలిక పదోన్నతులు రద్దు అవుతాయి. 16(హెచ్) నిబందన దృష్టిలో వుంచుకొని వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్-2 స్థాయిలో అందరి ప్రొబేషన్ తేదీని నిర్ణయించి, సర్వీసును రెగ్యులర్ చేస్తూ, సీనియారిటి జాబిత తయారు చేయాలి మరియు అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి. కాని కోర్టు తీర్పు వచ్చి సంవత్సరం గడచినప్పటికి డిపార్ట్మెంట్ లో ఎలాంటి చలనం లేదు. ప్రిసిపాల్ సెక్రెటరీ, కమిషనర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు నివేదించినా ఎలాంటి చొరవ చూపించడం లేదు. తాత్కాలిక పదోన్నతులు పొందిన అధికారులు ప్రస్తుతం ఉన్నత స్థానాలలో ఉండి హైకోర్టు తీర్పును తొక్కిపెట్టి అమలును వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు నివేదించగా మాకు కమీషనర్ కార్యాలయం నుండి స్పష్టమైన ఆదేశాలు రాలేదని దాటవేస్తున్నారు. కొందరు అభ్యర్డులు ఇదే విషయం శాఖ కమీషనర్ కు నివేదించగా వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్-2, గ్రేడ్-1 పదోన్నతులు మా పరిధిలోనికి రావు అని చెప్తూ ఉమ్మడి జిల్లా కలెక్టర్లను కలవమని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అభ్యర్దులు వాపోతున్నారు. మొత్తంమీద ఉన్నతాధికారులు గౌరవ హైకోర్టు తీర్పు డబ్ల్యూ పి నెంబర్ 12741/2013 తేది.01-12-2022 ను తొక్కిపెట్టుటకు అన్నిస్థాయిలలో ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలలో మొదటి నుండి పదోన్నతులలో సర్వీసు రూల్స్ 16(హెచ్) నిబందన పాటిస్తున్నారు. కాని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకోసం పాటుపడుతున్న తెలంగాణ షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి శాఖలో మాత్రం కోర్టు తీర్పులను గౌరవించకుండా నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. దీని వలన తగిన సీనియారిటీ కలిగివుండి చాలా కాలంగా పదోన్నతులకై ఎదురు చూస్తున్న అర్హులైన అభ్యర్డులు తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమార్కులు అడ్డదారుల్లో ప్రమోషన్లు పొంది అధికారాలు చెలాయిస్తున్నారు. సర్వీస్ రూల్స్ 16(హెచ్) నిబందన అమలు కోరుతూ హైకోర్టును ఆశ్రహించిన ప్రభుత్వం, ఆతర్వాత సర్వీస్ రూల్స్ 16(హెచ్) నిబందనకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడం విడ్డురంగా వుంది. దీని వెనకాల అక్రమ పదోన్నతులు పొంది ఉన్నతాధికారులుగా చలామణి అవుతున్న కొందరి ఉన్నతాధికారుల అదృశ్య హస్తం ఉందనేది నగ్న సత్యం తెలంగాణా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి శాఖకు ఇప్పటి వరకు మంత్రిని కేటాయించక పోవటం వలన ఈ శాఖ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వద్దనే వున్నది. గతంలో చాలా కాలం ఈ శాఖకు రెగ్యులర్ ప్రిసిపాల్ సెక్రెటరీ మరియు కమిషనర్ లేకపోవటం వలన త్వరితగతిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక పోయారు. శాఖామంత్రి గారైన గౌరవ తెలంగాణా రాష్త్ర ముఖ్యమంత్రివర్యులు ఈ విషయం పట్ల ప్రత్యేక దృష్టి సారించి గౌరవ హైకోర్టు తీర్పును అమలుచేస్తూ పదోన్నతులు కల్పిస్తూ అర్హులైన అభ్యార్థులకు న్యాయం చేయడమే అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తికి, రాజ్యంగ నిబద్ధతకు అద్దం పడుతుంది. న్యాయాస్థానాల తీర్పుల పట్ల ప్రజల్లో గౌరవంతో పాటు విశ్వాసనీయత పెరుగుతుంది.
-
Aksharam Telugu Daily