Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో అంతటా అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ఆదివారం వారు డీ.జీ.పీ డాక్టర్ జితేందర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్ లు, ఎస్పీలతో వరద ప్రభావిత పరిస్థితులను సమీక్షించారు. ఒక్కో జిల్లా వారీగా ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. అధికారులు అందరూ క్షేత్రస్ధాయిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని పేర్కొన్నారు. అయితే, ఎన్డీఆర్ఎఫ్ బృందాల వచ్చే వరకు వేచి చూడకుండా, పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవలను వినియోగిస్తూ ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్లాటూన్ల పోలీస్ బలగాలు అందుబాటులో ఉన్నాయని సూచించారు. చేపల వేటకు, ఈత సరదా కోసం చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ సిబ్బందిచే నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేయాలన్నారు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. వర్ష ప్రభావిత జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. లో లెవల్ వంతెనలు, కాజ్ వే లపై నుండి నీరు ప్రవహిస్తున్న మార్గాల గుండా వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలని సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు తెగిపోకుండా ముందస్తు అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. తాగునీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేస్తూ వరద పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పని చేయాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ మణుగూరు బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాలలో వరద ముంపు కు గురి అయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి భోజన సదుపాయాలు, వైద్య సదుపాయం, ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారి తమ సిబ్బందిచే పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, మిషన్ భగీరథ సిబ్బంది ప్రజలకు మంచినీటి కొరత లేకుండా తగిన ఏర్పాటు చేయాలని, ఎన్పీడీసీఎల్ సిబ్బంది నిరంతర కరెంటు సరఫరా అయ్యేటట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
-
Aksharam Telugu Daily