Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /తల్లాడ సెప్టెంబర్ 3 (అక్షరంన్యూస్) భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం శ్రీ శ్రీ సర్కిల్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లతో కలిసి అధికారులతో పాలేరు నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదల నష్టం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ రోడ్లు, కల్వర్టులు ఎక్కడెక్కడ దెబ్బతిన్నవి, పునరుద్ధరణ కు ఖర్చు తో సహా నివేదిక సమర్పించాలని, పనులు 5 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి చాలా చోట్ల దెబ్బతిన్నాయన్నారు. రాకాశితండా మినహా అన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణ చేసినట్లు, రాకాశితండా నేటి సాయంత్రం లోగా విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేస్తామన్నారు. సబ్ స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్స్, లైన్, విద్యుత్ స్తంభాలు, క్రొత్త కనెక్షన్లు వారంలోగా పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బతిని త్రాగునీటి సరఫరా లేని చోట, 10 రోజుల్లో చర్యలు చేపట్టి, త్రాగునీరు అందించాలన్నారు. నియోజకవర్గంలో 27 చోట్ల చెరువులు, కాల్వలు తెగడం జరిగినట్లు, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి ఈ సీజన్ లో సాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి పంట నష్టం ను క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, వాస్తవ నివేదిక సమర్పించాలన్నారు. దెబ్బతిన్న ఇండ్ల, ఆస్తుల సర్వే చేపట్టి వెంటనే పరిహారం అందజేతకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మొత్తం ప్రక్రియ త్వరితగతిన పూర్తి కి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సమీక్ష లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily