AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / సూర్యాపేట్/నేరేడుచర్ల : . సూర్యాపేట/నేరేడుచర్ల, సెప్టెంబర్ 2: అక్షరం న్యూస్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, నిరసనల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయడం, పార్టీ కార్యాలయాల వద్ద ఘర్షణలకు పాల్పడటం సరికాదని బుధవారం బీజేపీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి అన్నారు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అరెస్టు చేయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దాడి సమయంలో నాగం వర్షిత్‌రెడ్డి కుటుంబ సభ్యులను దూషించడంతో పాటు తల్లిదండ్రులు, మేనమామపై దాడి చేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని నాగిరెడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గుడ్లు విసరడంతో పాటు ఘర్షణకు పాల్పడ్డారని తెలిపారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం రాజకీయ పార్టీల హక్కులని, భౌతిక దాడులకు పాల్పడటం చట్టవిరుద్ధమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఘర్షణలకు కారణమైన వారిపై పోలీసులు దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొణతం నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
.
Aksharam Telugu Daily