AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాదులోని అసెంబ్లీ సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద సహచర ప్రభుత్వ విప్ లు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూతురు వాక్యాలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండ సురేఖ బుకాయించడం సరికాదన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి చేసిన వీరోచిత పోరాటం ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల ఫలితంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిని కట్టబెడితే ఆ పదవిని అనుభవిస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి పై, ఆయన సోదరులపై కొండ సురేఖ కుటుంబం విమర్శలకు దిగడం పట్ల ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. నిద్రాహారాలుమాని సుశిక్షితులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన కష్టార్జితం వల్ల, మరోవైపు ఎన్నో అవమానాలు, నిర్బంధాలను, కఠినమైన జైలు జీవితాలను అనుభవించిన రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నగ్నసత్యాన్ని ఎవరు కాదనలేరన్నారు. ఎంతోమంది అర్హులు ఉన్నప్పటికీ సీనియర్ నాయకురాలిగా గుర్తించి బీసీ మహిళగా క్యాబినెట్ మంత్రిగా కొండ సురేఖకు అవకాశం కల్పిస్తే, ఆమె చేసే రాజకీయం చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల మనసులు ఎంతగానో గాయపడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కూతుర్లు, కుమారులు చేసే పనులకు తల్లిదండ్రులు బాధ్యత వహించడం సహజమనే కనీస సాంప్రదాయాలకు కొండా సురేఖ తిలోదకాలు ఇస్తోందని అన్నారు. అలాంటిది ఏకంగా సీఎం పైనే తీవ్రమైన విమర్శలకు దిగిన తన ఇంట్లోనే ఉంటున్న తన కూతురు వాక్యలను ఎందుకు ఖండించడం లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు గారు సురేఖను ప్రశ్నించారు.
.
Aksharam Telugu Daily