Sunday, 13 July 2025 01:41:28 PM

వేసవి తీవ్రతకు అల్లాడుతున్న భారతావనికి చల్లటి కబురు.

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 15 May 2025 05:27 PM Views : 399

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మే 15 (అక్షరం న్యూస్) దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంతో పాటు ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాలకు విస్తరించినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంపై పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల బలం పెరిగింది. సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎగువన వీటి వేగం 20 నాట్లకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో అవి 4.5 కిలోమీటర్ల వరకూ విస్తరించాయి. * మేఘావృతానికి సూచికగా పరిగణించే ఔట్ గోయింగ్ లాంగ్వేవ్ రేడియేషన్ (ఓఎల్ఆర్) కూడా ఈ ప్రాంతంలో తగ్గింది. రానున్న మూణ్నాలుగు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలోని మరిన్ని భాగాలకు, అండమాన్ నికోబార్ దీవులంతటికి, అండమాన్ సముద్రంలోని మిగతా భాగాలకు విస్తరించేందుకు ఇవి దోహదపడతాయని ఐఎండీ వివరించింది. మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సాధారణంగా ఇవి జూన్ 1 నాటికి కానీ ఈ రాష్ట్రానికి చేరుకోవు. 2009లో అవి మే 23నే కేరళను తాకాయి. ఆ తర్వాత.. మళ్లీ ఇవి సాధారణం కన్నా ముందుగా రావడం ఇదే మొదటిసారవుతుంది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :