DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / పెద్దపల్లి : దొమ్మటి రాజేష్, పెద్దపల్లి ప్రతినిధి; మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలకంగా గుర్తింపు పొందిన మరో అధ్యాయానికి ముగింపు పలికింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి కరీంనగర్–ఖమ్మం–వరంగల్ జిల్లాల కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, తన భార్య ఈశ్వరితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో రాజిరెడ్డి, ఆయన భార్యతో పాటు పీఎల్‌జీఏ ముఖ్య నాయకుడు దేవా లొంగుబాటు పత్రాలు సమర్పించారు. అనారోగ్యం, అంతర్గత విభేదాలే కీలకం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. అదే సమయంలో పార్టీలో ఉన్న మరో మావోయిస్టు నేత బడే చొక్కారావుతో ఏర్పడిన అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కారణంగా పార్టీపై నమ్మకం కోల్పోయిన రాజిరెడ్డి, చివరకు లొంగుబాటుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. భార్య రాకతో నిర్ణయం పక్కాగా.. వైజాగ్‌కు చెందిన మావోయిస్టు నాయకురాలు ఈశ్వరి (ఎల్‌ఎల్‌బీ)తో రాజిరెడ్డి వివాహం జరిగింది. ఉద్యమంలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. అయితే కొంతకాలంగా ఈశ్వరి వ్యవహారికంగా దూరంగా ఉండటంతో లొంగుబాటు ఆలస్యమైంది. ఆమె తిరిగి సంప్రదింపుల్లోకి వచ్చిన అనంతరం ఇద్దరూ కలిసి లొంగిపోవాలని నిర్ణయించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రి నుంచి వ్యూహాత్మక లొంగుబాటు.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన సమయంలో రాజిరెడ్డి పోలీసుల చేతికి చిక్కినట్టు సమాచారం. పోలీసులు అరెస్టు చూపించాలని నిర్ణయం తీసుకోవడంతో, తనతో పాటు మరికొందరిని తీసుకొస్తానని చెప్పి వ్యూహాత్మకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, చివరకు వారితో కలిసి లొంగిపోయినట్టు తెలిసింది. కిష్టంపేట నుంచి అజ్ఞాతవాసం వరకు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్ కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, 10వ తరగతి వరకు చదివారు. 1994లో అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్‌తో సంబంధం ఏర్పరచుకొని కొంతకాలం కొరియర్‌గా పనిచేశారు. 1996లో పూర్తిగా అజ్ఞాతవాసంలోకి వెళ్లి మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు. 30 ఏళ్లుగా పోలీసులకు కొరకరాని కొయ్య మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ రాజు రెడ్డి, దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీసులకు కొరకరాని కొయ్యగా మారాడు. భద్రతా బలగాలు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినా, పోలీసుల వ్యూహాలను ముందుగానే పసిగట్టి తప్పించుకుంటూ అజ్ఞాత జీవితం కొనసాగించాడు. పోలీసుల కదలికలను చిత్తు చేస్తూ పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించిన రాజు రెడ్డి, భద్రతా వ్యవస్థకు పెద్ద సవాల్‌గా మారినట్టు అధికారులు పేర్కొంటున్నారు. పార్టీ బలోపేతంలో కీలక పాత్ర ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టు పార్టీ నిర్మాణం, బలోపేతంలో రాజు రెడ్డి కీలక పాత్ర పోషించాడు. స్థానిక క్యాడర్ సమీకరణ, కమిటీ వ్యవస్థ బలోపేతం, ఆయుధ బృందాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల్లో అతడి వ్యూహాలు పార్టీకి బలాన్నిచ్చాయని సమాచారం. అజ్ఞాతవాసంలోనే ఉండి అనేక కీలక నిర్ణయాలకు దిశానిర్దేశం చేశాడు. పోలీస్ వలలను ఛేదించిన వ్యూహకర్త రాజు రెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు గత మూడు దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. గాలింపు చర్యలకు ముందే సమాచారం అందుకోవడం, చివరి క్షణంలో మార్గం మార్చడం వంటి వ్యూహాలతో పోలీస్ వలలను ఛేదించాడు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తూ, భద్రతా బలగాలకు ఎదురుగా నిలిచే విధంగా పలు హింసాత్మక, విధ్వంసక చర్యలకు వ్యూహాత్మకంగా దిశానిర్దేశం చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. భద్రతా వర్గాల్లో కీలక చర్చ మూడు దశాబ్దాలుగా పోలీసులకు అందని నేత లొంగుబాటు భద్రతా వర్గాల్లో కీలక చర్చకు దారితీసింది. ఉమ్మడి జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు ఇది గట్టి ఎదురుదెబ్బగా, ఇతర అజ్ఞాత నేతలపై కూడా మానసిక ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం.. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహించిన రాజిరెడ్డి, భద్రతా బలగాలకు ప్రధాన సవాల్‌గా మారిన అనేక ఘటనల్లో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆయన లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా భద్రతా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
.
Aksharam Telugu Daily