Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / మార్చ్ 1 / అక్షరం న్యూస్ :- పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాల్లో 12,282 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలను నిశపక్షపాతంగా నిర్వహించేందుకు 73 చీఫ్ సూపరిడెంట్స్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 7 రూట్ ఆఫీసర్స్, 73 డిపార్టుమెంటల్ ఆఫీసర్స్,26 సెంటర్ కస్టోడియన్స్, 73 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిల్స్‌ను పోస్టాఫీసులకు తరలింపు భద్రంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలాని పోలీస్ అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు మరియు మరుగుదొడ్ల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుధ్య పనులను చేపట్టాలని, ఇందుకు మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేసి, మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవసరమైన మార్గాల్లో బస్సు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తగిన మందులతో ఆశాలను, ఎ ఎన్ లను అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓ కు సూచించారు. పరీక్ష సమయంలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, జిల్లా వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, విద్యుత్ శాఖ అధికారి మహేందర్, పోలీస్ శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily