Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 12 (అక్షరంన్యూస్)* *ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి వ్యవస్థ వృద్ధి చెందుతూ, ప్రజలకు నిత్యం కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ముడుపులు చెల్లించనిదే ఏ సేవకూ అవకాశం ఉండదని వాహనదారులు వాపోతున్నారు. అధికారుల వద్దకు వెళ్లే ప్రతి దరఖాస్తుపై బినామీల అనుమతి లేకుండా సంతకాలు జరగడం లేదు.* *ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్, ఇతర రవాణా అనుమతులు అన్నీ ఏజెంట్ల చేతుల్లో చిక్కి, వారి కనుసన్నల్లోనే కార్యాలయ వ్యవహారాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు నేరుగా సేవలు అందించాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా లంచగొండితమై, ప్రజా సంక్షేమం పక్కనపెట్టి అక్రమ వసూళ్లనే ప్రధాన ల్యక్షంగా పెట్టుకున్నట్టుగా వ్యవహరిస్తోంది.* *బినామీల ఆధిపత్యం – అధికారుల మౌన సమ్మతి* *ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులే అధికారులుగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఏ ఫైలు అయినా ముందుగా అధికారులు నియమించిన ఇద్దరు బినామీల ద్వారా పరిశీలనకు వెళ్లి, వారి అనుమతి పొందిన తరువాతే అధికారుల వద్దకు చేరుతుంది. ఆ అనుమతి పొందడానికి ఏకంగా కోడ్ విధానం అమలులో ఉందని సమాచారం. ఏజెంట్ల ద్వారా వచ్చిన దరఖాస్తులపై ముద్ర పడిన తరువాతే సంతకాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి*. *రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వివిధ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవడంతో ముడుపుల వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుందనే ఆశలు రేగినప్పటికీ, అధికారుల తీరు మారలేదు. అందుబాటులో ఉన్న సేవలను బినామీల చేతుల్లో ఉంచి, వారిని మామూలు వ్యక్తులుగా చూపించి అక్రమంగా వసూళ్లు కొనసాగిస్తున్నారు.* *అధికారుల లెక్కలు – బినామీల చేతుల్లో లావాదేవీలు* *ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో జిరాక్స్ సెంటర్లే లావాదేవీల కేంద్రంగా మారాయి. అధికారుల సంతకాల లెక్కలు, రోజువారీ వసూళ్ల వివరాలు, ఏజెంట్ల నుంచి వచ్చే డబ్బులు అన్నీ ఈ జిరాక్స్ సెంటర్ల ద్వారానే జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి*. *కార్యాలయంలో ఏ ఫైలు ఎంత మొత్తానికి ముద్రపడుతుందనే లెక్కలు సాయంత్రానికి బినామీల వద్ద నిక్షిప్తమవుతాయని తెలుస్తోంది.* *ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ రవాణా శాఖ అవినీతి కట్టడి కాలేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. అధికారులు పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు సాగిస్తున్నా, ఏసీబీ దృష్టి సారించడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.* *లైసెన్స్ రెన్యువల్స్‌లో తీవ్ర జాప్యం – వాహనదారుల వేదన* *డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, ఇతర రవాణా అనుమతుల కోసం నిష్కల్మషంగా దరఖాస్తు చేసిన వాహనదారులు నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వాహన తనిఖీల్లో ఒరిజినల్ లైసెన్స్ లేకపోతే ₹2000 నుండి ₹4000 జరిమానా విధిస్తున్నప్పటికీ, లైసెన్స్ పొందేందుకు అధికారులు తిప్పలు పెడుతున్నారు* *ఖమ్మం వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ అర్హులు, రవాణా వ్యాపారస్తులు – అందరూ కలసి అవినీతిపై పోరాడాలని, సంబంధిత శాఖలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.*
.
Aksharam Telugu Daily