Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : తల్లాడ మండలం నూతనకల్ సంఘంలో వివాదస్పద పరిణామాలు.. నూతనకల్ (తల్లాడ మండలం): సత్తుపల్లి నియోజకవర్గంలోని గంగిదేవిపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం భవనం ఆవిష్కరణ కార్యక్రమం చర్చలకు దారి తీసింది. ఫ్లెక్సీలలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సహకార సంఘం జిల్లా అధ్యక్షులు వంటి కాంగ్రెస్ నేతల ఫోటోలు లేకపోవడం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలను ఎత్తిపారేసి, గత బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకుల ఫోటోలకే ప్రాధాన్యం ఇవ్వడం వివాదాస్పదమైంది. సొసైటీ చైర్మన్ చొరవ తీసుకుని, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను ఈ కార్యక్రమం దరిదాపులకు కూడా రానివ్వకుండా అడ్డుకోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర విమర్శలకు కారణమైంది. సొసైటీ చైర్మన్ పై విమర్శలు.. కాంగ్రెస్ నేతలు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా అడ్డగించిన గంగిదేవిపాడు సొసైటీ చైర్మన్ వ్యవహారశైలిపై మండల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చైర్మన్ తీరును ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తలపై దురుసుగా మాట్లాడడమే కాకుండా, "సొసైటీ నడుస్తుంది నా మాటలతో మాత్రమే" అంటూ చట్టానికీ, నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ నేతల మాటల్లో.. కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ, "సహకార సంఘం భవనం ఆవిష్కరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలను పక్కన పెట్టడం అన్యాయం. ఈ సంఘం అభివృద్ధికి కృషి చేసిన నాయకుల ఫోటోలు ఉంటేనే ప్రజలకు వాస్తవం తెలుస్తుంది. కానీ, ఇక్కడ తమ వ్యక్తిగత ప్రయోజనాలను ప్రదర్శించేందుకు చైర్మన్ ప్రయత్నించారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ శ్రేణుల ఫ్లెక్సీలకే ప్రాధాన్యం.. ఆవిష్కరణలో కేవలం బిఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలతో కార్యక్రమాన్ని నిర్వహించడం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవేదన కలిగించింది. మండల నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, "గత ప్రభుత్వాల నుంచి వచ్చిన నేతలపై నమ్మకం ఉంచడమే కాకుండా, వారి ప్రాధాన్యతను పెంచడం పూర్తిగా రాజకీయ కక్షసాధన" అని విమర్శలు గుప్పించారు. కార్యక్రమం ముగింపులో సంఘర్షణ వాతావరణం కార్యక్రమం చివర్లో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సొసైటీ చైర్మన్ పైశాచిక ఆనందం పొందుతూ ఇలాంటివి చేస్తున్నారన్నది కాంగ్రెస్ నేతల విమర్శ. తీర్మానాలు చేయాల్సిన అవసరం... ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అన్ని పార్టీలకూ సమానంగా న్యాయం చేయడం నైతిక బాధ్యత. రాజకీయ కక్షలను పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. కానీ గంగిదేవిపాడు సంఘం చైర్మన్ తీరుకు అనేక విమర్శలు రావడంతో పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తాయి. సమగ్ర విచారణ చేపట్టి, ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
.
Aksharam Telugu Daily