Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ జనవరి 9 (అక్షరంన్యూస్) గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నామని, ఆ దిశగా సీతారామ ఎత్తిపోతల పథకం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గురువారం మంత్రి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తో కలిసి తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో నాబార్డు నిధులతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ కార్యాలయ భవనం, గోదాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ,* తల్లాడ మండలంతో తనకు చాలా రోజులుగా అనుబంధం ఉందని తెలిపారు. రైతు ప్రాధాన్యతగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. సాగర్ పై లిఫ్టు పెట్టి చివరి భూముల వరకు సాగునీరు తీసుకుని వచ్చామని, చెక్ డ్యాం లు నిర్మించామని, తన చిరకాల కోరిక అయిన గోదావరి జలాలు కూడా రైతుల పొలాలకు త్వరలో రాబోతున్నాయని మంత్రి తెలిపారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు రావాలని తాను ఆకాంక్షించానని, కృష్ణా జలాలు రాని పరిస్థితుల్లో కూడా గోదావరి నీటితో ఖమ్మం జిల్లాలో సాగునీరు అందాలని, ఈ ప్రాంతం పచ్చగా ఉండాలని ఆలోచించి ఎత్తిపోతల ద్వారా ఖమ్మం జిల్లాకు గోదావరిని తీసుకు వస్తున్నామని, ఇటీవలే పెండింగ్ పనులు పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని అన్నారు. రాబోయే సంవత్సరంలో కృష్ణ జలాలు రావడం ఆలస్యమైనప్పటికీ, గోదావరి నీటితో రైతులకు సకాలంలో సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల పరిధిలో సాగునీటికి సంపూర్ణ భరోసా అందించేలా సీతారామ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే సంవత్సరానికి సత్తుపల్లి, వైరా నియోజక వర్గాలకు గోదావరి జలాలు చేరుతాయని మంత్రి తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి సంవత్సరంలో రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులు ఖాతాలలో జమ చేశామని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకుని మాఫీ కానీ అర్హులైన రైతులు ఉంటే వివరాలు అందించాలని, వాటికి కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో 12 వేల రైతు భరోసా నిధులు రైతు ఖాతాలలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, రాబోయే రోజులలో మంచి పంటలు పండి రాష్ట్ర ఆదాయం పెరిగితే రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకుంటామని అన్నారు. వివిధ కారణాలతో రైతు మరణిస్తే ఆ కుటుంబానికి వారం రోజులలో 5 లక్షలు చేరే విధంగా రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. రాబోయే ఖరీఫ్ పంట నుంచి ప్రతి పంటకు బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. దిగుమతి తగ్గితే, పంట రాని పక్షంలో ఆ లోటును రైతుకు బీమా కంపెనీల ద్వారా భర్తీ చేసే విధంగా పంటల బీమా పథకాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. రైతులు వరి పంట మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వైపు దృష్టి సారించాలని, ఆయిల్ పామ్, జాజి, వక్క వంటి పంటలు సాగు చేయాలని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా అవసరమైన మౌళిక వసతులు, గోదాం, పనిముట్లు, తదితరఅందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, పరిపాలన పరంగా రైతులకు వెసలుబాటు ఉండే విధంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో *సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ,* రైతుల సంక్షేమమే పరమావధిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నాయకత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ పని చేస్తున్నదని, 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిందని, సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలో వస్తాయని, వరి పంటకు మద్దతు ధరతో పాటు, సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ రైతులకు అందడం పట్ల చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లి పరిధిలో యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం ఆగిపోయిందని, ఈ ప్రాజెక్టుపై మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని పనులు పున ప్రారంభించారని అన్నారు. వైరా నియోజకవర్గానికి ప్రత్యామ్నాయ కాలువ నిర్మించారని తెలిపారు. మలేషియా నుంచి పామాయిల్ సాగు ఆధునిక పద్ధతులను పరిశీలించి ఇక్కడ మన రైతులచే అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి గంగాధర్, డిసిసిబి సిఇఓ వెంకట ఆదిత్య, పిఏసీఎస్ గంగదేవిపాడు చైర్మన్ తూము వీరభద్రరావు, డైరెక్టర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily