Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : - హుస్నాబాద్ /సిద్దిపేట అక్టోబర్ 26(అక్షరం న్యూస్ ) ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ విద్యుత్ చార్జీలను పెంచడం శోచనీయమని అన్నారు.200 యూనిట్లు దాటితే ప్రస్తుతం ఉన్న రూ.10 ఫిక్స్ డ్ చార్జీలను, రూ.50కి పెంచాలని డిస్కబ్లు ప్రతిపాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇదేనా పేదలకు ఇచ్చే గృహలక్ష్మిపై రేవంత్ రెడ్డి సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి అని ఎద్దేవా చేశారు. ఆచరణకు అమలు కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కొరతను సృష్టించడమే కాకుండా, కరెంటు కోతలకు తోడు విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. విద్యుత్ అంటే వ్యాపారం కాదని రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే రథచక్రం అని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి, మిషన్ భగీరథ కు రూ.1200 కోట్లను సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. విద్యుత్ చార్జీల పెంపును ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండ కట్టాలని తీవ్రంగా వ్యతిరేకించాలని, తిరగబడి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన నాడు తీవ్రమైన విద్యుత్ కొరతతో ఉండేదని, నాడు పారిశ్రామిక వేత్తలు పవర్ హాలిడేస్ వద్దని ఇందిర పార్క్ వద్ద ధర్నాలకు దిగిన పరిస్థితి కనిపించిందని, మరో వైపు రైతులు కరెంట్ లేక తీవ్ర నిరాశలో ఉన్న దుస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ ఇబ్బందులను అధిగమించిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు పదేళ్ల పాటు విద్యుత్ సంస్థలకు సర్ణయుగంగా మారిందన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన 10 నెలల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని, దానికి తోడు ఇప్పుడు కరెంట్ ఛార్జీల వాతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన ఛార్జీలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని కోరారు. కేసీఆర్ అధికారంలో ఉన్న్పపుడు పదేళ్ల పాటు రాష్ట్ర ప్రజల మీద ఒక్క రూపాయి భారం వేయలేదన్నారు. డిస్కంలు చేసిన ప్రతిపాదన పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉంది. ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నాడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన మాజీ సీఎం కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కరెంట్ ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని.. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ విద్యుత్ ను 5 నుంచి 7.5 హెచ్ పీ పెంచాలి. 7.5 హెచ్ పీకి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్ పీసీడీఎల్ సగటు ధర నిర్ణయించేది. కానీ ఆ తర్వాత బల్క్ సప్లయ్ టారిఫ్ ఆధారంగా నిర్ణయిస్తోందని.. సర్ ఛార్జీ కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అదనపు యూనిట్లు ఖర్చు ప్రభుత్వమే భరించాలని.. విద్యుత్ డిస్కములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.మొత్తంగా ప్రజలపై 18 వేల కోట్ల భారాన్ని మోపాలని చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని, ప్రజలకు మద్దతుగా అలుపెరుగని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily