Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది చిన్న చిన్న కారణాలు, సమస్యలతో మానసిక ఒత్తిడికి గురికావద్దని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు. ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలు తనను ఎంతో బాధ పెట్టాయని, క్షణికావేశానికి లోనయ్యి తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించకుండా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. తమకు కేటాయించిన విధులను నిజాయితీతో సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, వరదల సమయంలో విధులు,,మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టడం, గంజాయి అక్రమ రవాణాను నివారించడం లాంటి విధులను సమర్థవంతంగా నిర్వహించడంలో జిల్లా పోలీసులకు మంచి పేరు ఉందని గుర్తుచేశారు. దురలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి నడవడికతో ప్రజలకు సేవలు అందిస్తూ బాధ్యతగల పోలీస్ అధికారిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. అనంతరం కాన్ఫరెన్స్ ద్వారా కొంతమంది తమ సమస్యలను జిల్లా ఎస్పీకి తెలుపుకున్నారు. వాటి పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తామని ఎస్పీ భరోసా కల్పించారు.
-
Aksharam Telugu Daily