అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : గుజరాత్ మోర్బి జిల్లాలో మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో చనిపోయిన వారికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్లిష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు. "మోర్బి వంతెన కూలిన ఘటనలో తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు జిల్, నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆప్తులను కోల్పోయిన గుజరాత్ ప్రజలతో పాటు మేము సంతాపం ప్రకటిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మేము భారతీయ ప్రజలకు అండగా నిలుస్తాము." అని బైడెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. "గుజరాత్‌లో వంతెన కూలిన విషాద ఘటనలో తమ ఆప్తులను కోల్పోయిన బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాం. భారత ప్రజలకు మేము అండగా ఉంటాము." అని ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ ట్వీట్ చేశారు. ఇదిలాఉంటే.. గుజరాత్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 140 దాటిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో 47 మంది వరకు చిన్నారులు ఉండటం అందరి హృదయాలను కలిచివేస్తుంది. కాగా, 125 మందిని మాత్రమే మోయగలిగే సామర్థ్యం ఉన్న ఆ వంతెనపైకి 500 మంది చేరడమే కాక.. దాన్ని ఊపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మరోవైపు నిర్లక్ష్యంతో ఈ ప్రమాదానికి కారకులుగా భావిస్తూ 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
.
Aksharam Telugu Daily