అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : న్యూఢిల్లీ: దేశప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు శనివారం (అక్టోబరు 1) నుంచి ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతోపాటు.. ‘న్యూ డిజిటల్ యూనివర్స్’ అనే ఇతివృత్తంతో అక్టోబరు 1 నుంచి 4 దాకా ఢిల్లీలో నిర్వహించే ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ ఆరో వార్షికోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 5జీ సేవల విషయానికి వస్తే.. తొలి దశలో ప్రధాన నగరాలతో ప్రారంభించి, వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఏమిటీ 5జీ?ఇన్నాళ్లుగా మనం వాడుతున్న 4జీ సేవలకు అనేక రెట్ల వేగంతో 5జీ నెట్‌వర్క్‌లు పనిచేస్తాయి. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాల్లో అత్యంత ప్రధానమైనది.. లాటెన్సీ. అంటే.. స్పందించే వేగం. ఉదాహరణకు మనం గూగుల్ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్‌బార్‌లో సంబంధిత పదాన్ని టైప్ చేసి ఎంటర్ కీని నొక్కుతాం. మనం ఇచ్చిన ఆ ఆదేశానికి 4జీ నెట్‌వర్క్ అయితే.. 60 మిల్లీ సెకన్ల నుంచి 80 మిల్లీసెకన్లలో స్పందించి సెర్చ్ చేయడం మొదలుపెడుతుంది. అంటే 4జీలో లాటెన్సీ 60-80 మిల్లీసెకన్లు ఉంటుంది. అదే 5జీలో అయితే ఈ సమయం 5 మిల్లీసెకన్ల కన్నా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వేగం పెరుగుతుంది. 4జీలో గరిష్ఠ డౌన్‌లోడ్ వేగం 1జీబీపీఎస్ (గిగాబిట్స్ పర్ సెకన్) కాగా.. 5జీలో అది 10 జీబీపీఎస్. దీనివల్ల అత్యధిక నాణ్యత, నిడివి కలిగిన వీడియోలను, సినిమాలను సైతం సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 4జీ-5జీ సేవల మధ్య ఉన్న మరో ప్రధానమైన తేడా సమాచార ప్రసార విధానం. 4జీలో సమాచార సంకేతాలు సెల్ టవర్ల నుంచి ప్రసారమవుతాయి. 5జీలో అయితే.. ఇందుకు స్మాల్ సెల్ టెక్నాలజీని వాడుతారు. అంటే.. పిజ్జా బాక్సుల సైజులో ఉండే చిన్న సెల్స్ ద్వారా హైబ్యాండ్ 5జీ సేవలను అందుబాటులోకి తెస్తా రు. అలాంటి బాక్సులను అమర్చలేని చోట, తక్కువ ఫ్రీక్వె న్సీ స్పెక్ట్రమ్‌లున్న చోట.. సెల్ టవర్లనే వినియోగిస్తారు.
.
Aksharam Telugu Daily