అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : హైదరాబాద్ /సెప్టెంబర్.30/ అక్షరం న్యూస్; పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు హెచ్చరించారు. అబార్షన్లు, ప్రసవాలు కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటివారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్లు లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా కొందరు ఆర్.ఎం.పి సంఘాల నేతలు డి.హెచ్ గడల శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు. ఆసుపత్రులపై కొనసాగుతున్న దాడులు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆసుపత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 2508 ఆస్పత్రులలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని, నిబంధనలు అతిక్రమించిన 13 ఆస్పత్రులను సీజ్ చేశారు 633 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారని, 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారని తెలిపారు.
Aksharam Telugu Daily