అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : -టీఎస్ పీఎస్సీకి చెందిన వారికే అత్యధిక మార్కులు... -టీఎస్ పీఎస్సీ చైర్మన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి... -యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/మార్చి 23/అక్షరంన్యూస్ : గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ఛేదించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయంతో పాటు టీఎస్ పీఎస్సీకి చెందిన సబ్యులకు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన రాష్ట్ర సర్కారుకు పదవీలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న జనార్ధన్ రెడ్డి ప్రశ్నపత్రాలను తన ఆధీనంలో ఉంచుకోవాలని, రేషన్ బియ్యం తీసుకోవాలంటేనే ఓటిపీ తీసుకునే యంత్రాంగం రాష్ట్రంలో ఉన్నప్పుడు టీఎస్ పీఎస్సీ చైర్మన్ సిస్టమ్ ఎలా హ్యాక్ అయ్యిందని ప్రశ్నించారు. విద్యావంతులు, అవినీతి ఆరోపణలు లేని వ్యక్తులు టీఎస్ పీఎస్సీలో చోటు కల్పించాల్సింది ఉండగా సీఎంవోలో పనిచేసే వారి బంధువులు, బీఆర్ఎస్ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసిన వారికి ఎలా చోటు కల్పించారని ప్రశ్నించారు. కనీసం ప్రత్యేక కార్యాలయం లేని సిట్ కు గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని శోధించాల్సిందిగా ఎలా బాధ్యతలు అప్పగిస్తారని నిలదీశారు. లీకేజీకి సంబంధించి అన్ని కోణాల్లో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును తప్పనిసరిగా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సాయి, చెనిగారపు నిరంజన్ కుమార్, కాకటి బాబు, పోలే కనకరాజు, అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily