అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం ‘సరోగసి’. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ నటి నయనతార అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే నయన్, విఘ్నేశ్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నేరుగా పిల్లలకు జన్మనివ్వకుండా సరోగసి పద్ధతి ద్వారా తల్లులుగా మారుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే పలువురు తారలు ఈ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, ఈ విధానంలో పిల్లల్ని కనాలంటే కొన్ని నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో సరోగసి విధానం నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం ఇక్కడ చట్టరీత్యా నేరం. ఇది జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చింది. కొత్తగా అమల్లోకి వచ్చిన సరోగసి చట్టం ప్రకారం ఐదేళ్ల వివాహ బంధాన్ని పూర్తిచేసుకున్న దంపతులు మాత్రమే సరోగసికి అర్హులుగా పరిగణిస్తారు. భార్య వయసు కచ్చితంగా 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండి… అలాగే భర్త వయసు 26 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా, ఆ దంపతులకు జన్యుపరంగా కానీ, దత్తత ద్వారా కానీ ఒక్క సంతానం కూడా ఉండకూడదు. అలాగే, అద్దె తల్లి ఈ దంపతులకు దగ్గర బంధువై ఉండాలి. ఆమెకు పెళ్లై ఉండాలి, అప్పటికే బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగసి ద్వారా పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఇందు కోసం ముందుగా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరోగసి ద్వారా బిడ్డను పొందడం, బిడ్డ పెంపకం, సంరక్షణ హక్కులకు సంబంధించి మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలి. అద్దె తల్లికి ప్రసవం అనంతరం వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు 16 నెలల పాటు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవరేజీ కల్పించాలి. అమ్మకం, వ్యభిచారం, ఇతర చెడు మార్గాల్లో సరోగసిని ఉపయోగించకుండా తాజా చట్టం నిషేధించింది. బిడ్డ జన్మించిన తర్వాత అన్ని హక్కులు సంబంధిత జంటకే ఉంటాయని స్పష్టం చేసింది. ఒకవేళ అబార్షన్ చేయించాలంటే అద్దె తల్లి, అధికారుల అనుమతితోనే జరుగుతుంది, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 10ఏళ్ల జైలు శిక్ష, రూ.పది లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
.
Aksharam Telugu Daily