అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : భువనేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను ఒడిశాలో కూడా అమలు చేయాలని నవ నిర్మాణ్ కిసాన్ డిమాండ్ చేసింది. నవ నిర్మాణ్ కిసాన్ సభ అధ్యక్షుడు అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ వరకు 10 వేల మంది రైతులతో 7 రోజుల పాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.ఒడిశా రైతులకు సౌత్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్ చైర్మన్ కోటపాటి నరసింహ నాయుడు,వెంకటేశ్వర్లు మద్దతు ప్రకటించారు. అయితే ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు పాదయాత్రగా బయల్దేరిన రైతులను జాస్పూర్ జిల్లా ధన్‌మండల్ పట్టణంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ, తమ పాదయాత్రను కొనసాగించి భువనేశ్వర్‌కు చేరుకుంటామని రైతులు స్పష్టం చేశారు. రేపు మరో 5 వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొంటారని రైతు ఉద్యమ నాయకులు ఒడిశా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాదయాత్ర ను అడ్డుకోవడంతో ధన్మండల్ రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్షయ్ కుమార్ అనే రైతు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలపై ఇప్పటికే అధ్యయనం చేశారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలతోనే అక్కడి రాష్ట్ర ప్రజలు సంపన్నులు అవుతున్నారని పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రం రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే.. -ధాన్యంకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. -తెలంగాణ రాష్ట్రంలో నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఒడిశాలో కూడా నేరుగా రైతుల వద్దనే ధాన్యం కొనుగోలు చేయాలి. -వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఇవ్వాలి. -రైతులకు కనీస పెన్షన్ రూ. 5 వేలు ఇవ్వాలి.
.
Aksharam Telugu Daily