అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : తెలంగాణ కొత్త సచివాలయంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఘటనలో కొత్త టిస్ట్ బయటపడింది. ఇది అగ్నిప్రమాదం కాదని, మాక్ డ్రిల్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సచివాలయ భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారని, అందులో భాగంగా మంటలు వచ్చాయని అంటున్నారు. సీఎం కార్యాలయం ఉండే 5,6 అంతస్తుల్లో మాక్ డ్రిల్ జరిపినట్లు చెబుతున్నారు. అయితే అధికారుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాక్ డ్రిల్ జరిపితే అంత పెద్ద ఎత్తున మంటలు ఎందుకు వస్తాయని, భవనంలోని ఇతర ఫ్లోర్లకు ఎందుకు వ్యాపిస్తాయని అనుమానిస్తున్నారు. దీనిపై అధికారులు పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపుతోంది. వుడ్ వర్క్ జరుగుతుండగా అగ్నిప్రమాదం జరిగిందని కొంతమంది చెబుతుండగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగినట్లు మరికొంతమంది అంటున్నారు. తెల్లవారుజామున గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టాస్టిక్ మెటీరియల్‌కు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత భనవం కుడిపైపు, సచివాలయం ప్రధాన గుమ్మటం దగ్గర దట్టంగా పొగలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 11 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఫైర్ డీజీ నాగిరెడ్డి ఏకంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్‌ను అధికారులు మూసేశారు. సెక్రటేరియట్ దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. మీడియాను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు. ఈ నెల 17న తన పుట్టినరోజున కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ తరుణంలో కొత్త సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం ప్రభుత్వ వర్గాలనకు ఆందోళన కల్గిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈసారి సచివాలయంలోనే అగ్నిప్రమాదం జరగడం కలవరపెడుతోంది. సెక్రటేరియట్ పనులపై సీఎం కేసీఆర్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
.
Aksharam Telugu Daily