అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : సైఫయి(యూపీ) : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ములాయం సొంత గ్రామమైన యూపీలోని ఇటావా జిల్లా సైఫయిలో మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చితికి కొడుకు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిప్పంటించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ములాయం (82) సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో కన్నుమూశారు. సాయంత్రం ఆయన పార్థివదేహాన్ని సైఫయికి తరలించారు. మంగళవారం ఉదయం ఆయన సొంత ఇంటి నుంచి శ్మశానవాటికకు సాగిన అంతిమయాత్రలో అనేక మంది ప్రముఖులు, లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మేళా గ్రౌండ్ వద్ద ములాయంకు ప్రజలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ములాయం పార్థివదేహాన్ని ఉంచిన ట్రక్కుపై అఖిలేశ్ తో పాటు ఆయన సోదరుడు శివ్ పాల్ యాదవ్, ఇతర కుటుంబసభ్యులు, యోగా గురువు బాబా రాందేవ్, తదితరులు నిలుచున్నారు. వేలాది మంది అభిమానులు ట్రక్కును అనుసరిస్తూ ‘నేతాజీ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ అశ్రునయనాలతో తుదివీడ్కోలు పలికారు. సైఫయి జనసంద్రం నేతాజీని చివరిసారిగా చూసేందుకు లక్షలాది మంది గ్రామానికి తరలివచ్చారు. సైఫయి మొత్తం జనసంద్రంలా మారింది. ఎక్కువ మంది తెల్లని దుస్తులు ధరించి వచ్చారు. వాన చినుకులు పడుతున్నా అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కిలోమీటరుకుపైగా క్యూలో నిలబడి ఆయనను చివరిచూపు చూసుకుని వీడ్కోలు పలికారు. ప్రముఖుల హాజరు ములాయం అంత్యక్రియలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్, స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, యూపీ సీఎం యోగి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, తెలంగాణ సీఎం కేసీఆర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం యేచూరి, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, రైతు సంఘం నేత రాకేశ్ తికాయత్, సమాజ్ వాదీ ఎంపీ జయాబచ్చన్, ఆమె కొడుకు అభిషేక్ బచ్చన్, తదితరులు హాజరయ్యారు.
.
Aksharam Telugu Daily