అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : నవంబర్ 25, 2022 ( అక్షరం న్యూస్) ఎందుకంత ఆత్రం! ఏ రకమైన నియామకం ఇది? మెరుపువేగంతో ఫైల్‌ను ఎందుకు ఆమోదించారు? ఈసీ పదవి మే నెల నుంచి ఖాళీగా ఉన్నది.. నవంబర్‌లో ఎందుకు ఆతృత చూపారు? ప్రక్రియనంతా 24 గంటల్లో ముగించారు దీనికి అనుసరించిన పద్ధతి ఏంటి? ఎంపికైన నలుగురిలో ఒక్కరు కూడా.. ఆరేండ్లు పదవిలో ఉండేవారు కాదు కారణాలు కనుగొనడం కష్టంగా ఉన్నది ఈసీగా గోయల్ నియామకంపై సుప్రీంకోర్టు ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు న్యూఢిల్లీ, నవంబర్ 24: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌గోయల్‌ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత ఆతృత చూపించిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను మెరుపువేగంతో ఆమోదించడంపై అసహనం వ్యక్తంచేసింది. గోయల్ ఫైలు కనీసం 24 గంటలన్నా ఆయా శాఖల వద్ద లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ఈ కేసులో విచారణను ముగించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)ల నియామకానికి సంబంధించి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కూడా విచారణ కొనసాగించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా కొత్తగా నియమితులైన అరుణ్‌గోయల్‌కు సంబంధించిన ఫైల్‌ను తమ ముందుంచాలని బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కోర్టుకు సమర్పించారు. ఆ పత్రాలను పరిశీలించిన జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తంచేసింది. సామర్థ్యాన్ని కాదు ప్రక్రియను ప్రశ్నిస్తున్నాం ‘ఏ రకమైన నియామకం ఇది? అరుణ్ గోయల్ అర్హతలను, సామర్థ్యాన్ని మేం ప్రశ్నించడం లేదు. కానీ ఆయన నియామకానికి అనుసరించిన ప్రక్రియను ప్రశ్నిస్తున్నాం. అంత ‘మెరుపువేగం’తో గోయల్ ఫైల్‌ను ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది? ఎన్నికల కమిషనర్ పోస్టు మే నెల 15 నుంచి ఖాళీగా ఉన్నది. కానీ నవంబర్ నెలలో మాత్రమే ప్రభుత్వం ఎందుకు తొందరపడింది? ఒక్కరోజులోనే ఆయన వీఆర్‌ఎస్‌కు ఆమోదం..! ఒక్కరోజులోనే ఈసీ నియామకానికి నోటిఫికేషన్..! ఒక్కరోజులోనే గోయల్ ఎంపిక! మెరుపు వేగంతో ఫైల్ ఆయా శాఖల మధ్య కదిలింది. దీనికి సమాధానం చెప్పాలి’ అని ధర్మాసనం అటార్నీ జనరల్‌ను కోరింది. గోయల్ నియామకానికి సంబంధించిన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని వెంకటరమణి కోరారు. పరిశీలన చేయకుండా వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. కోర్టు తీరుతో ఎగ్జిక్యూటివ్‌లోని చిన్నచిన్న విషయాలను కూడా సమీక్షిస్తారా? అన్న సందేహం తలెత్తుతున్నదని అన్నారు. ఈ సందర్భంగా డిఫెన్స్ లాయర్ ప్రశాంత్ భూషణ్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా.. ‘మీరు కొద్దిసేపు నోరు మూసుకుంటారా?’ అంటూ వెంకటరమణి అసహనం వ్యక్తంచేశారు. దీనిపై జస్టిస్ అజయ్ రస్తోగి స్పందిస్తూ.. ‘మీరు కోర్టు వేసే ప్రశ్నలను జాగ్రత్తగా విని సమాధానం ఇవ్వండి. మేము ఒక వ్యక్తి నియామకాన్ని గూర్చి ప్రశ్నించడం లేదు. నియామకానికి అనుసరించిన ప్రక్రియను ప్రశ్నిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కోర్టు వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే తాను వచ్చానని వెంకటరమణి చెప్పారు. అంతా ఒక్కరోజులోనే! ‘అరుణ్ గోయల్ ఒక్కరోజులోనే తాను పనిచేస్తున్న శాఖ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆయన ఫైల్‌ను న్యాయశాఖ ఒక్కరోజులోనే ఆమోదించింది. ఒక్కరోజులోనే ఈసీ పదవి కోసం నాలుగు పేర్లను ఎంపిక చేసి ప్రధానమంత్రికి పంపింది. 24 గంటల్లో గోయల్ పేరుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. నలుగురిలో అందరికన్నా చిన్నవాడైన అరుణ్‌గోయల్‌ను ఏ ప్రాతిపదికన ఎంపికచేశారు? దీనికి అనుసరించిన పద్ధతి ఏంటి?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘ఎన్నికల కమిషనర్ పదవి కోసం న్యాయశాఖ మంత్రి ‘అతి జాగ్రత్తగా ఎంపిక చేసిన’ నాలుగు పేర్లలో ఒక్కరు కూడా ఆరేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేసేవారు లేరు అని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్ వ్యాఖ్యానించారు. ఈసీ ఎంపికకు పద్ధతి, ప్రమాణాలు ఉన్నాయని, ప్రతి అధికారి పనితీరును పరిశీలించి, అతడు ఆరేండ్ల పాటు పదవిలో ఉంటాడా? లేదా? అన్నది చూడలేమని వెంకటరమణి చెప్పారు. ఈసీ పదవి ఆరేండ్లు ఎలక్షన్ కమిషన్ చట్టం, 1991 ప్రకారం ఈసీగా నియమితులయ్యేవారు ఆరేండ్లపాటు లేదా 65 ఏండ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగాలి. ప్రభుత్వ అధికారిగా అరుణ్‌గోయల్ అందించిన సేవలను చూడకుండా అతడు వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అంశాన్ని సమస్యగా మారుస్తున్నారని అటార్నీ జనరల్ అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘చట్టం ప్రకారం ఈసీ ఆరేండ్లపాటు పదవిలో కొనసాగాలి. ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి ఆ నిర్దిష్ట కాలాన్ని పూర్తి చేసేలా చూడాలి. కానీ ఆరేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేయలేని నలుగురు వ్యక్తులను న్యాయశాఖ మంత్రి ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణాలను కనుగొనడానికి ఎంతో ‘శ్రమించాల్సి’ వస్తున్నది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గోయల్ ఐదేండ్లకు పైగా పదవిలో కొనసాగనున్నారు. 2025 ఫిబ్రవరిలో ఆయన సీఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కేసులో నాలుగురోజులపాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. పిటిషనర్లు, ప్రభుత్వం ఐదు రోజుల్లోగా రాతపూర్వకంగా తమ వాదనలు సమర్పించాలని ఆదేశించింది. సీఈసీ, ఈసీలను పారదర్శకంగా నియమించడానికి కొలీజియం వంటి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు సూచనలు భేష్ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి సర్వోత్తముడైన వ్యక్తిని ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా నియమించేలా ఓ వ్యవస్థను రూపొందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన సూచనలు అభినందనీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా విధులు నిర్వర్తించాలని, రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉండాలన్నారు. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకొంటుందని, చివరకు ప్రజా తీర్పే అంతిమం అన్నారు. ఇప్పటికైనా సుప్రీం ధర్మాసనం సూచనలను పరిగణనలోకి తీసుకొంటే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily