అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : పాట్నా: సొంత ప్రభుత్వాన్ని విమర్శించిన మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. బీహార్‌లో అధికారంలో ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)కు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ సొంత ప్రభుత్వపై శనివారం మండిపడ్డారు. తన శాఖ రోడ్ మ్యాప్‌లను ఆయన ప్రశ్నించారు. సంబంధిత లక్ష్యాలు చేరుకోలేకపోవడంతో దిద్దుబాటు చర్యలు లేకుండా వాటి కొనసాగింపు వృథా అని విమర్శించారు. వ్యవసాయ మంత్రిగా రోడ్ మ్యాప్ పొడిగింపునకు తాను అంగీకరించబోనని తేల్చి చెప్పారు. వ్యవసాయ మూడో రోడ్ మ్యాప్‌ను 2022 తర్వాత కూడా పొడిగించాలని ప్రభుత్వం భావిస్తే మరో శాఖ లేదా నోడల్ శాఖ ద్వారా ఆ పని చేయాలని మంత్రి సుధాకర్ సింగ్ సూచించారు. అలాగే తన శాఖలోని అవినీతిపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడటంతో వ్యవసాయ శాఖలో ‘బీజేపీ ఎజెండా’ కొనసాగింపును అనుమతించబోనని అన్నారు. కాగా, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన సుధాకర్ సింగ్ తన మంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఆయన తండ్రి, ఆర్జేడీ బీహార్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. ‘రైతులకు, వారికి జరుగుతున్న అన్యాయానికి ఎవరైనా అండగా నిలువాలి. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి ఇది వెళ్లింది. మండి చట్టం (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ యాక్ట్)ను రద్దు చేయడం రాష్ట్ర రైతులను నాశనం చేసింది’ అని జగదానంద్ సింగ్ వ్యాఖ్యానించారు.
.
Aksharam Telugu Daily